: విశాఖలో వైఎస్సార్సీపీ పని అయిపోయినట్టేనా?
విశాఖపట్టణం జిల్లాలో వైఎస్సార్సీపీ పని అయిపోయినట్టేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అరకు ఎంపీ కొత్తపల్లి గీత వివాదం రేగిన నాటి నుంచి విశాఖ జిల్లాలో వైఎస్సార్సీపీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. తాజాగా ముగ్గురు వైఎస్సార్సీపీ నేతలు టీడీపీలో చేరేందుకు మంత్రి గంటాతో మంతనాలు సాగిస్తున్నట్టు సమాచారం. ఎంపీ గీతకు అవమానం జరిగిందని వివాదం రేగినా, పార్టీ స్పందించకపోవడంతో విశాఖలో వైఎస్సార్సీపీకి నష్టం ప్రారంభమైంది. దీంతో ఆమె పార్టీకి దూరమైంది. వెంటనే కొణతాల వర్గానికి వ్యతిరేకంగా పార్టీ అధిష్ఠానం నిర్ణయాలు తీసుకుంటుండడంతో ఆయన పార్టీని వదిలేశారు. ఆయనతో పాటు భారీ స్థాయిలో అనుచరవర్గం కూడా పార్టీ వీడింది. తాజాగా విశాఖ తూర్పు, ఉత్తర నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు వంశీకృష్ణశ్రీనివాస్, చొక్కాకుల వెంకట్రావులు ఈ నెల 17న ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నట్టు సమాచారం. దీంతో విశాఖలో వైఎస్సార్సీపీకి రోజులు చెల్లినట్టేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.