: మతానికి, ఉగ్రవాదానికి ముడిపెట్టొద్దు: మోదీ
మతానికి, ఉగ్రవాదానికి ముడిపెట్టొద్దని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మయన్మార్ లో జరిగిన తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సులో ఆయన మాట్లాడుతూ, మతానికి, ఉగ్రవాదానికి మధ్య సంబంధాన్ని ప్రపంచ దేశాలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాల్లో ఉగ్రవాదం, వేర్పాటు వాదం విపరీతంగా పెరిగిపోతున్నాయని, వాటిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని మోదీ అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని పేర్కొన్న ఆయన, ఉగ్రవాదానికి, మాదకద్రవ్యాలకు, ఆయుధాల అక్రమ రవాణాకు, మనీల్యాండరింగుకు అంతర్లీన సంబంధం ఉందని స్పష్టం చేశారు. ఉగ్రవాదం ఎదుర్కొనేందుకు కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.