: తెలంగాణ సీఎం ఇలాకా గజ్వేల్ లోనూ రింగు రోడ్డు!
మెదక్ జిల్లాలోని గజ్వేల్, హైదరాబాద్ కు అతి సమీపంలోని నగర పంచాయతీ. మొన్నటి అసెంబ్లీ బరిలో తెలంగాణ సీఎం కేసీఆర్ పోటీ చేసి విజయం సాధించింది ఇక్కడి నుంచే. సీఎం కేసీఆర్ ను అసెంబ్లీకి పంపిన గజ్వేల్, ఐదు నెలల్లోనే ప్రభుత్వం నుంచి విడుదలవుతున్న నిధులతో తడిసి ముద్దవుతోంది. ఇక తాజాగా హైదరాబాద్ తరహాలో రింగు రోడ్డు కూడా గజ్వేల్ లో ఏర్పాటయ్యేందుకు రంగం సిద్ధమైంది. మొత్తం రూ.90 కోట్లతో చేపట్టనున్న ఈ రింగు రోడ్డు కోసం తాజా బడ్జెట్ లో రూ.30 కోట్లను కూడా సర్కారు కేటాయించేసింది. త్వరలో పనులు ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రక్రియపై అధికారులు శరవేగంగా చర్యలు తీసుకుంటున్నారు. ఐదు నెలల్లోనే ఈ మేర నిధులొస్తే, రానున్న ఐదేళ్లలో గజ్వేల్ రూపురేఖలే మారిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది.