: రెండు కోట్లు ఇస్తేనే వదులుతాం!: రాయచోటి కాంట్రాక్టర్ విడుదలకు బోడోల డిమాండ్
అసోంలో కిడ్నాప్ కు గురైన తెలుగు కాంట్రాక్టర్ మహేశ్వరరెడ్డిని విడిచిపెట్టేందుకు బోడో మిలిటెంట్లు రూ.2 కోట్లు డిమాండ్ చేశారు. ఆదివారం ఉదయం మహేశ్వరరెడ్డిని బోడో తీవ్రవాదులు అపహరించిన సంగతి తెలిసిందే. కడప జిల్లా రాయచోటికి చెందిన మహేశ్వరరెడ్డి, అసోంలో జాతీయ రహదారి నిర్మాణ పనులను సబ్ కాంట్రాక్ట్ కు తీసుకుని చేస్తున్నారు. ఆదివారం ఉదయం తన ఆధ్వర్యంలో కొనసాగుతున్న పని ప్రదేశం వద్దకు బైక్ పై వెళుతున్న ఆయనను తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ సమాచారం అందిన వెంటనే మహేశ్వరరెడ్డిని విడిపించేందుకు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి రంగంలోకి దిగినా, ఆయన యత్నాలు ఫలించలేదు. తాజాగా ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత రూ.2 కోట్లిస్తేనే మహేశ్వరరెడ్డిని విడుదల చేస్తామన్న తీవ్రవాదుల డిమాండ్ ఆయన కుటుంబ సభ్యులను చేరింది. మరోవైపు మహేశ్వరరెడ్డిని విడిపించేందుకు అసోం ప్రభుత్వం కూడా చర్యలు ప్రారంభించినట్లు సమాచారం.