: ఏపీ కంటే 364 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను తెలంగాణ అదనంగా వాడుకుంది: పరకాల
తెలంగాణ ప్రభుత్వ వ్యవహారశైలి దొంగే దొంగ అన్నట్టుగా ఉందని ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ ఆరోపించారు. తెలంగాణ కరెంట్ కష్టాలకు ఏపీ ప్రభుత్వమే కారణమని కేసీఆర్ విమర్శిస్తున్నారని... వాస్తవం చెప్పాలంటే, ఏపీ కంటే తెలంగాణనే 364 మిలియన్ యూనిట్ల అదనపు విద్యుత్ ను వాడుకుందని తెలిపారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని పవన విద్యుత్ తెలంగాణకు ఎలా వస్తుందని ప్రశ్నించారు. జీవో 26, 53 ప్రకారం, తెలంగాణకు ఆ విద్యుత్ పై ఎలాంటి హక్కు లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం విభజన చట్టానికి అడుగడుగునా తూట్లు పొడుస్తోందని పరకాల విమర్శించారు. తెలంగాణ అధికారులు ప్రతి చోటా ఏపీ ప్రభుత్వంతో గొడవలు పడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ అధికారులు, పోలీసుల వైఖరిపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్ర కేబినెట్ కార్యదర్శికి ఫిర్యాదు చేశారని తెలిపారు.