: కాలి నడక భక్తులకు స్వామి దర్శనం రద్దు... తిరుమలలో టీటీడీపై నిరసనలు
పవిత్ర పుణ్యక్షేత్రం, వెంకటేశ్వరస్వామి సన్నిధానం తిరుమలలో మరో వివాదం చెలరేగింది. తిరుపతి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులకు శని, ఆదివారాల్లో స్వామి వారి దర్శనాన్ని రద్దు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) నిర్ణయం తీసుకుంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా టీటీడీ తీసుకున్న ఈ అకస్మాత్తు నిర్ణయంపై శనివారం భక్తులు భగ్గుమన్నారు. లగ్జరీ వాహనాల్లో వచ్చే ధనవంతులకు స్వామివారి దర్శనాన్ని కల్పిస్తున్న టీటీడీ, అత్యంత భక్తిశ్రద్ధలతో నడక మార్గాన తిరుమల కొండకు వస్తున్న తమకెందుకు స్వామి దర్శనాన్ని నిరాకరిస్తారని ప్రశ్నిస్తూ ఆందోళనకు దిగారు. ప్రస్తుతం తిరుపతిలోని అలిపిరి వద్ద భక్తుల నిరసనలు కొనసాగుతున్నాయి. టీటీడీ ఎలా స్పందిస్తుందన్న దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.