: ప్రజల భాగస్వామ్యంతో నవ్యాంధ్ర రాజధాని: చంద్రబాబు
రాష్ట్రంలోని ప్రతి పౌరుడిని రాజధాని నిర్మాణంలో భాగస్వామిని చేస్తామని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రంలోని 4.5 కోట్ల మందికి రాజధాని నిర్మాణంలో ప్రత్యక్ష పాత్ర ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. శనివారం తన నివాసంలో రాజధాని భూసేకరణ సబ్ కమిటీ సభ్యులతో చంద్రబాబు భేటీ అయ్యారు. భేటీ ముగిసిన తర్వాత సమావేశం వివరాలను చంద్రబాబే మీడియాకు వెల్లడించారు. రాజధాని నిర్మాణానికి ఎంత భూమి అవసరమవుతుందన్న విషయాన్ని భవిష్యత్తు తేల్చుతుందన్నారు. గుంటూరు, విజయవాడ పరిసరాల్లో రాజధాని వద్దని వారించిన వారూ ఉన్నారని ఆయన తెలిపారు. అయితే ప్రపంచ స్థాయి సౌకర్యాలతో రాజధాని నిర్మాణాన్ని చేపడతామని ఆయన చెప్పారు. రాజధాని లేని నేపథ్యంలో పొరుగు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కూర్చుని పనిచేయలేకపోతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. మరోవైపు నవ్యాంధ్రకు రాజధాని అన్నది లేకుండానే చేసేందుకు కొందరు యత్నించారని ఆయన ఆరోపించారు.