: ఢిల్లీ బరి... అన్ని పార్టీలకూ సంకటమే!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు పెను సవాల్ గానే పరిణమించాయి. ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ విలవిల్లాడుతుంటే, పోటీకి అభ్యర్థుల నిరాకరణతో ఆమ్ ఆద్మీ పార్టీ సతమతమవుతోంది. ఇక ప్రజలకు భవిష్యత్తు తామేనంటూ బీరాలు పలుకుతున్న బీజేపీ, ఆప్ ప్రభంజనాన్ని చూసి లోలోపలే మధనపడుతోంది. అయితే మిగిలిన పార్టీలతో పోలిస్తే, ఈ దఫా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్న పార్టీ మాత్రం బీజేపీనేనని చెప్పాలి. మొన్నటి ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ చేతిలో ఘోర పరాజయం చవిచూసిన షీలా దీక్షిత్ ఎన్నికలంటేనే భయపడిపోతున్నారు. తాజాగా ఢిల్లీ ప్రజలు అధికారమిచ్చినా, సద్వినియోగం చేసుకోలేకపోయిన పార్టీగా ఆప్ అవతరించిందని, ఆ కారణంగానే ఆ పార్టీ టికెట్ పై పోటీ చేయదలచుకోలేదని ఆప్ ఎమ్మెల్యే హరీశ్ ఖన్నా ప్రకటించారు. ఇప్పటికే ఓ ఎమ్మెల్యే పోటీకి దిగనని ప్రకటించగా, తాజాగా ఖన్నా పోటీకి విముఖత చూపుతున్న రెండో వ్యక్తిగా నిలిచారు. "కాంగ్రెస్ 15 ఏళ్ల పాటు ఢిల్లీని పాలించింది. అన్ని రకాల హామీలిచ్చింది. వేటినీ నెరవేర్చలేదు. ఢిల్లీ ప్రజలిచ్చిన అధికారాన్ని ఆప్ దుర్వినియోగం చేసింది. దీంతో ప్రస్తుతం ఢిల్లీ ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేసే పార్టీగా బీజేపీనే నిలుస్తోంది" అని ఆ పార్టీ దక్షిణ ఢిల్లీ ఎంపీ రమేశ్ బిదురి చెప్పారు.