: మావోలతో ఏయూ ప్రొఫెసర్ కు సంబంధాలు... అరెస్ట్ చేసిన పోలీసులు!


నిషేధిత మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారనే నెపంతో విశాఖ జిల్లా పోలీసులు బుధవారం రాత్రి ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ అప్పారావును అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి అప్పారావు ఇంటికెళ్లిన పోలీసులు వివరాలేమీ చెప్పకుండా ఆయనను తమ వెంట తీసుకుని వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయనను గుర్తు తెలియని ప్రాంతంలో ఉంచి విచారించినట్లు తెలుస్తోంది. పోలీసులమంటూ ఇంటికొచ్చిన వారితో బయటకెళ్లిన భర్త ఎంతకీ తిరిగి రాకపోవడంతో, అప్పారావు భార్య రాత్రంతా బిక్కుబిక్కుమంటూనే కాలం వెళ్లదీశారు. గురువారం తెల్లవారగానే బంధువులతో కలసి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆమె ఫిర్యాదు చేసేదాకా నోరెత్తని జిల్లా ఎస్పీ ప్రవీణ్, ఫిర్యాదు అందిన రెండు గంటల తర్వాత తామే అరెస్ట్ చేశామంటూ ప్రకటించారు. ఎస్పీ ప్రకటనతో, ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటనపై నిరసన వ్యక్తమైంది. పోలీసుల తీరుపై పౌర హక్కుల సంఘం నేత వరవరరావు విరుచుకుపడ్డారు. మావోలకు అనుబంధంగా పనిచేస్తున్నప్పటికీ అరెస్ట్ చేసే తీరిదేనా? అంటూ ఆయన పోలీసుల వైఖరిని ఖండించారు. ఇక, వర్సిటీ విద్యార్థులు కూడా పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. అందరితో కలుపుగోలుగా ఉండే అప్పారావు, మావోలకు అనుబంధంగా పనిచేసే అవకాశమే లేదని కొందరు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. తమ అదుపులోని అప్పారావును ఈ సాయంత్రం కోర్టు ముందు ప్రవేశపెడతామని ఎస్పీ ప్రకటించారు.

  • Loading...

More Telugu News