: ఆదివారం కేంద్ర మంత్రివర్గ విస్తరణ... కొత్తగా పది మందికి అవకాశం!
ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరించేందుకు దాదాపుగా నిర్ణయించుకున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోగానే కేబినెట్ విస్తరణను పూర్తి చేయాలని భావిస్తున్న మోదీ, విస్తరణకు ఆదివారం ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజా మంత్రివర్గ విస్తరణలో గోవా సీఎం మనోహర్ పారికర్ ను కేబినెట్ లో చేర్చుకోవడంతో పాటు ఆయనకు కీలకమైన రక్షణ శాఖను కేటాయించాలని భావిస్తున్నారు. బీరేంద్ర సింగ్ (హర్యానా), హన్ష్ రాజ్ ఆహార్ (మహారాష్ట్ర), గిరిరాజ్ సింగ్ (బీహార్), జయంత్ సిన్హా (జార్ఖండ్)లకు మంత్రి పదవులు దక్కే అవకాశాలున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో పార్టీ వృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు, సామాజిక వర్గాలకు సమ ప్రాధాన్యం ఇచ్చే దిశగా కేబినెట్ కూర్పు ఉండబోతోందన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అభిప్రాయాన్ని మోదీ పరిగణనలోకి తీసుకుంటారని తెలుస్తోంది.