: భువనేశ్వర్ కు ఐసీసీ పీపుల్స్ చాయిస్ అవార్డు
ఎల్జీ ఐసీసీ పీపుల్స్ చాయిస్ అవార్డుకు టీమిండియా ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఎంపికయ్యాడు. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు పొందిన నాలుగో క్రికెటర్ అతనే కావడం విశేషం. 2010లో తొలిసారి సచిన్ టెండుల్కర్ ఈ అవార్డుకు ఎంపికవగా, 2011, 12లో శ్రీలంక క్రికెటర్ కుమార సంగక్కర, గతేడాది టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గెలుచుకున్నారు. ఈ సందర్భంగా భువనేశ్వర్ మాట్లాడుతూ, "అవార్డు ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎల్జీ ఐసీసీ పీపుల్స్ చాయిస్ అవార్డుకు నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇది నా ఒక్కడి వ్యక్తిగత ప్రదర్శనకేగాక... అభిమానుల ప్రేమ, మద్దతుకు అర్థం" అని పేర్కొన్నాడు. కాగా, ఈ ఏడాది పురస్కారానికి ఇంగ్లండ్ మహిళల కెప్టెన్ చార్లెట్ట్ ఎడ్వర్డ్స్, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మైఖేల్ జాన్సన్, లంక కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్, దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ లు పోటీ పడ్డారు.