: మా ఓటమికి అన్ని పార్టీలు కలసి కుట్ర పన్నాయి: బీఎస్పీ అధినేత్రి మాయావతి


ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి బుధవారం సరికొత్త ఆరోపణలు చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ లోని అన్ని రాజకీయ పార్టీలు కలసి తమ ఓటమికి కుట్ర పన్నాయని ఆమె ఆరోపించారు. కనీవినీ ఎరుగని రీతిలో మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని పార్టీలు అనైతిక కుట్రకు పాల్పడ్డాయని, ఆ కారణంగానే ఎన్నికల్లో తాము ఓటమి చవిచూశామని ఆమె ఆవేదన వెళ్లగక్కారు. రాజకీయ పార్టీగానే కాక సామాజిక ఉద్యమానికి బాటలు వేసిన పార్టీగానూ బీఎస్పీ అవతరించిందని న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాయావతి చెప్పారు. రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు సమ ప్రాధాన్యమిచ్చిన పార్టీగా బీఎస్పీ తన గురుతర బాధ్యతలను నెరవేరుస్తోందన్నారు. మహారాష్ట్ర, హర్యానాలో బీజేపీ తన సొంత సత్తాతో గెలవలేదని, కాంగ్రెస్ పై ఆ రాష్ట్రాల్లో వ్యక్తమైన వ్యతిరేకతే వారి విజయానికి కారణంగా నిలిచిందనీ అన్నారు. రానున్న రాజ్యసభ ఎన్నికల్లో బీఎస్పీ తరఫున బరిలోకి దిగుతున్న ఇద్దరు అభ్యర్థులను గెలిపించుకునే ఎత్తుగడల్లో భాగంగానే మాయావతి ఈ వ్యాఖ్యలు చేశారన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News