: సచిన్ చెప్పిన వన్నీ వాస్తవాలే... ఛాపెల్ రింగ్ మాస్టరే!:లక్ష్మణ్
టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ ఛాపెల్ పై క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ చెప్పిన ప్రతి విషయం వాస్తవమేనని ప్రముఖ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ స్పష్టం చేశాడు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, 'ప్లేయింగ్ ఇట్ మై వే' లో సచిన్ పేర్కొన్నట్టు ఛాపెల్ రింగ్ మాస్టర్ లా వ్యవహరించారని అన్నాడు. సచిన్ ఆత్మకథలో పేర్కొన్నట్టు ఛాపెల్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన 2005 నుంచి 2007 మధ్య కాలంలో అన్నీ వివాదాలేనని లక్ష్మణ్ తెలిపాడు. ఆటగాళ్లంతా తన చెప్పుచేతల్లో ఉండాలని ఛాపెల్ భావించేవాడని లక్ష్మణ్ వెల్లడించాడు. 2006లో ముంబైలోని వాంఖడ్ స్టేడియంలో ఇంగ్లండ్ తో జరిగిన ఓ టెస్టు మ్యాచ్ లో తనను ఓపెనింగ్ చేయమని ఛాపెల్ ఆదేశించినట్టు లక్ష్మణ్ వివరించాడు. కాగా, అతని ఆఫర్ ను తాను తిరస్కరించినట్టు లక్ష్మణ్ స్పష్టం చేశాడు. ఓపెనింగ్ లో రాకపోతే 31 ఏళ్ల వయసులో టీమిండియాలో చోటు కష్టమని ఛాపెల్ బెదరించినట్టు లక్ష్మణ్ వెల్లడించాడు. లక్ష్మణ్ లాగే గంగూలీ కూడా ఛాపెల్ పై ధ్వజమెత్తిన విషయం తెలిసిందే.