: భారత్... జపాన్ ను ఫాలో అవ్వాలంటున్న ఆర్ఎస్ఎస్ చీఫ్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ భారత్ దశ, దిశ తదితర అంశాలపై తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. భారత్ అభివృద్ధి అంశంలో జపాన్ బాటలో నడవాలని సూచించారు. ఆగ్రాలో 5000 మంది విద్యార్థులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో నిర్వహించిన 'యువ సంకల్ప్ శిబిర్' లో ఆయన మాట్లాడుతూ, జపాన్ ను అనుసరించినప్పుడు మాత్రమే భారత్ పురోగతి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా భగవత్ 'ద ఇంక్రెడిబుల్ జపనీస్' పుస్తకాన్ని ప్రస్తావించారు. పుస్తకం చివరి పేజీలోని 9 సూత్రాలు జపనీయులు వ్యక్తిత్వాన్ని సూచిస్తాయని అన్నారు. వాటిని చదివి ఆకళింపు చేసుకోగలిగితే భారతీయులకు ఎదురుండదని అభిప్రాయపడ్డారు. అమెరికా 1945లో జపాన్ ను నాశనం చేసిందని, తద్వారా, సంపద, మానవ వనరుల పరంగా జపాన్ తీవ్రంగా నష్టపోయిందని వివరించారు. అయితే, కేవలం 30 ఏళ్లలోనే జపాన్ పూర్వ వైభవాన్ని సంతరించుకుందని తెలిపారు. మనకు అపార మానవ వనరులున్నా, ఉమ్మడి లక్ష్యం లేని కారణంగానే ఎదగలేకపోతున్నామని ఆర్ఎస్ఎస్ చీఫ్ పేర్కొన్నారు. మనం పురోగామి పథంలో నడవాలంటే జపాన్ నుంచి పాఠం నేర్చుకోవాల్సిందే అని స్పష్టం చేశారు.