: ఢిల్లీలో ఎన్నికలు అనివార్యం... ఫిబ్రవరిలో ముహూర్తం?
ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాది డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ (31), కాంగ్రెస్ (8), ఆప్ (28), ఇతర పార్టీలు 2, ఒక ఇండిపెండెంట్ విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ సహకారంతో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ 49 రోజులకే రాజీనామా చేసింది. దీంతో ఢిల్లీలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో గవర్నర్ నజీబ్ జంగ్ రాజకీయ పార్టీలతో చర్చలు ప్రారంభించారు. కానీ అక్కడ ఏ పార్టీ ఇతర పార్టీని మద్దతు అడిగే పరిస్థితి లేదు. ఢిల్లీలో బీజేపీకి ఆప్ ప్రధాన ప్రత్యర్థి. దీంతో ఆ రెండు పార్టీలు పొత్తుపెట్టుకునే ప్రసక్తి లేదు. పోనీ కాంగ్రెస్, ఆప్ జట్టుకడతాయా అంటే కేజ్రీవాల్ అందుకు సిద్ధంగా లేరు. బీజేపీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం అన్నది కల్ల. ఈ నేపథ్యంలో మరోసారి ఎన్నికలకు వెళ్లడమే మేలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా వీస్తున్న మోదీ గాలిని తమకు అనుకూలంగా మలచుకోవాలని బీజేపీ భావిస్తుండగా, తన 49 రోజుల పాలనే తనను అధికారంలోకి రప్పిస్తుందని కేజ్రీవాల్ ఊహిస్తున్నారు. ఏది ఏమైనా ఫిబ్రవరిలో ఢిల్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.