: ఎంత చదువుకుంటే అంత అభివృద్ధి: చంద్రబాబు
ఎంత చదువుకుంటే అంత అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న బాబు మాట్లాడుతూ, పిల్లలను బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తిమంతులవుతారని పేర్కొన్నారు. ఆదర్శ పాఠశాలల ద్వారా పిల్లలను ప్రభుత్వమే చదివిస్తుందని తెలిపారు. ఇక, పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసి నీటి ఎద్దడి లేకుండా చేస్తామని భరోసా ఇచ్చారు. 3,4 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాబోయే రెండో పంటకు తప్పకుండా నీరు అందిస్తామని, ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. కాల్వల్లో గుర్రపు డెక్క తొలగింపు, మరమ్మతు బాధ్యతలను రైతులకే అప్పగిస్తామని బాబు ఈ సందర్భంగా చెప్పారు. పారిశుద్ధ్యంపై మాట్లాడుతూ, ప్రతి గ్రామం స్వచ్ఛ గ్రామంగా అవతరించాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఉండాలని, మరుగుదొడ్డి నాగరిక ప్రపంచానికి చిహ్నమని పేర్కొన్నారు. పారిశుద్ధ్యం కోసం ప్రతి పంచాయతీకి రూ.10 లక్షల చొప్పున ఇచ్చామని తెలిపారు.