: ఆటోడ్రైవర్ ని చితకబాదారు... కూకట్ పల్లిలో పోలీసుల దాష్టీకం!
హైదరాబాదులోని కూకట్ పల్లిలో పోలీసులు ఓ ఆటోడ్రైవర్ పై దాష్టీకం ప్రదర్శించారు. తామడిగిన లంచం ఇవ్వలేదంటూ ఆటోడ్రైవర్ గోపీని చితకబాదారు. దీంతో, బాధితుడు డీసీపీకి, మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశాడు. దీనిపై నివేదిక ఇవ్వాలని కమిషన్ కూకట్ పల్లి ఏసీపీని ఆదేశించింది. ఘటన వివరాల్లోకెళితే... కూకట్ పల్లి రామాలయం వద్ద ఓ ఆటోస్టాండ్ ఉంది. పోలీసులు ఈ నెల 14న ఆటోడ్రైవర్ గోపీతోపాటు మూడు ఆటోలను స్టేషన్ కు తీసుకెళ్ళారు. ఆటోకు రూ.5 వేల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎలాగో రూ.4 వేలు పోగుచేసిన గోపి అంతకుమించి ఇవ్వలేనని చెప్పడంతో డీఎస్ఐ క్రాంతికుమార్ కు ఆగ్రహం వచ్చింది. వెంటనే గోపి కాళ్ళు, చేతులు కట్టేసి పోలీసు మార్కు ట్రీట్ మెంట్ రుచిచూపాడు. ఎవరికైనా చెబితే తప్పుడు కేసులు పెట్టి జైలుపాలు చేస్తానని హెచ్చరించాడు. గాయాలపాలైన గోపి చికిత్స అనంతరం, తనను కొట్టిన డీఎస్ఐ క్రాంతికుమార్, కానిస్టేబుళ్ళు నర్సింగ్ రావు, గోపాల్ లపై ఫిర్యాదు చేశాడు.