: ఏపీలో బలీయ శక్తిగా ఎదుగుతున్న బీజేపీ!
నరేంద్ర మోదీ మేజిక్ తో దేశంలో మునుపెన్నడూ లేని రీతిలో వెలిగిపోతున్న భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో బలీయ శక్తిగా ఎదుగుతోంది. రాష్ట్ర విభజన, జనాల్లో కరిగిపోయిన కాంగ్రెస్ విశ్వాసం, జగన్ వేరు కుంపటి చతికిలబడటం లాంటి కారణాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. కేంద్రంలో స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆ పార్టీ, తొలిసారిగా హర్యానాలో అధికారాన్ని దక్కించుకుంది. ఇక మహారాష్ట్ర ఎన్నికల్లో తన సత్తా ఏమిటో ప్రత్యర్థులకు రుచిచూపించింది. తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ఆ పార్టీ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో తన బలాన్ని పెంచుకుంటోంది. ఇప్పటికే చంద్రబాబు కేబినెట్ లో రెండు బెర్తులు దక్కించుకున్న బీజేపీ, ఈ దఫా తానే అధికారం చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకునేందుకు రామ్ మాధవ్ ను రంగంలోకి దించింది. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ నుంచి వలసలుండవు. అదే సమయంలో ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ లో నుంచి ఎలా బయటపడాలా? అన్న కోణంలో చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్న నేతలపై ఆ పార్టీ వల వేస్తోంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను తనవైపునకు తిప్పుకోగలిగింది. అంతేకాక కాంగ్రెస్ లోని మరికొంత మంది సీనియర్లను లాగేందుకు రామ్ మాధవ్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక ప్రజాతీర్పులో భంగపడ్డ వైఎస్సార్సీపీ నేతలు కూడా బీజేపీ వైపే అడుగులేస్తున్నారు. మంగళవారం ఆ పార్టీ అధ్యక్షుడిపై విరుచుకుపడ్డ కొణతాల రామకృష్ణ కూడా బీజేపీలోనే చేరే అవకాశాలున్నాయి. ఆయన వెంట ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా బీజేపీ పంచన చేరచ్చు. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన మరింత మంది సీనియర్లు తమ పార్టీలో చేరనున్నారని రాష్ట్ర మంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ చేసిన ప్రకటనే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వివిధ పార్టీల నుంచి వస్తున్న కీలక నేతలతో రానున్న ఎన్నికల నాటికి బీజేపీ రాష్ట్రంలో బలీయ శక్తిగా ఎదగనుందనడంలో ఎలాంటి సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.