: రాష్ట్రపతి నిర్ణయాలను సుప్రీంకోర్టు ప్రశ్నించజాలదు: కేంద్రం
ఢిల్లీలో నెలకొన్న రాజకీయ అయోమయ పరిస్థితులు కేంద్రం, సుప్రీంకోర్టుల మధ్య మాటల యుద్ధానికి తెరలేపాయి. ఇంకెన్ని రోజులు ఢిల్లీలో రాష్ట్రపతి పాలనను కొనసాగిస్తారంటూ ప్రశ్నించిన సుప్రీంకోర్టుకు అదే స్థాయిలో కేంద్రం సమాధానం ఇచ్చింది. రాష్ట్రపతి నిర్ణయాలపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోజాలదని కేంద్రం తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో మంగళవారం నాటి విచారణ ఇరువర్గాల మధ్య దాదాపుగా మాటల యుద్ధానికి వేదికైంది. సుప్రీంకోర్టు తన పరిధి దాటి వ్యవహరిస్తోందన్న తీరులో మోదీ సర్కారు తన వాదనలకు పదును పెట్టింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం చేపట్టిన విచారణ సందర్భంగా కేంద్రం తరఫున వాదనలు వినిపించిన ప్రముఖ న్యాయవాదులు వేణుగోపాల్, అమన్ సిన్హా తప్పంతా ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ దైతే, కోర్టు మోదీ సర్కారుపై విరుచుకుపడటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి నిర్ణయాలపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదన్న న్యాయవాదుల వాదనతో కాస్త ఇబ్బందిపడ్డ సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణను గురువారానికి వాయిదా వేసింది. గురువారం కూడా ఈ విషయంలో వాడీవేడీ విచారణ జరిగే అవకాశాలున్నాయి.