: వైజాగ్ రోడ్లపై పశువులు తిరిగితే రూ. వెయ్యి జరిమానా!
నిజమే... వైజాగ్ రోడ్లపై పశువులు తిరిగితే వాటి యజమానులకు రూ. 1000 జరిమానా విధిస్తారు. ఇదేంటి, రోడ్ల మీద పశువులు తిరగకూడదా?... ఆ మాత్రానికే ఇంత భారీ జరిమానానా? అంటారా, తప్పదు మరి. ఇటీవల సంభవించిన హుదూద్ తుపానుతో సుందర వైజాగ్ నగరంలోని చెట్లన్నీ నేలకూలాయి. వీటి స్థానంలో ఇప్పుడు మొక్కలను నాటనున్నారు. దాదాపు రెండు లక్షల మొక్కలను నాటేందుకు సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో, పశువులు రోడ్లపై తిరిగితే... మొక్కలను నాశనం చేస్తాయని అధికార యంత్రాంగం భావిస్తోంది. అందుకే, పశువులను రోడ్లమీదకు వదల రాదంటూ వాటి యజమానులకు ఆదేశాలు జారీ చేసింది. ఒక వేళ పశువులు రోడ్లపై కనపడితే... వాటిని గోశాలకు తరలించడమే కాకుండా, జరిమానా కూడా విధిస్తారు. నగర వాతావరణంతో పాటు గ్రామీణ వాతావరణం కూడా ఉండే విశాఖలో పశువులను కట్టడి చేయడం చాలా కష్టం. అందుకే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ నిర్ణయానికి వచ్చారు.