: దక్షిణాఫ్రికాలో క్రీడాకారుల వరుస మరణాలు
దక్షిణాఫ్రికాలో క్రీడాకారులు వరుసగా మరణిస్తుండడంతో విషాద ఛాయలు నెలకొన్నాయి. శనివారం నాడు ఓ మహిళా బాక్సర్ ప్రాణాలు విడిచింది. అక్టోబర్ 10న జరిగిన ఓ బౌట్లో ఫిండిలే ఎంవెలాసే అనే బాక్సర్ ప్రత్యర్థి విసిరిన బలమైన పంచ్ లకు తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్ళింది. రెండు వారాల పాటు మృత్యువుతో పోరాడిన అనంతరం, శనివారం తుదిశ్వాస విడిచిందని దక్షిణాఫ్రికా క్రీడల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఒలింపిక్ రజత పతక విజేత, 800మీ పరుగు అంశంలో మాజీ వరల్డ్ చాంపియన్ ఎంబులేని ములౌద్జి శుక్రవారం నాడు ఓ కారు ప్రమాదంలో మరణించడం తెలిసిందే. అటు, దక్షిణాఫ్రికా సాకర్ జట్టు కెప్టెన్ సెంజో మెయివా ఆదివారం దుండగుల కాల్పుల్లో ప్రాణాలు విడిచాడు. దక్షిణాఫ్రికా క్రీడారంగానికి ఇది కష్టకాలమని క్రీడల మంత్రిత్వ శాఖ పేర్కొంది. అద్భుతమైన బాక్సర్ ను కోల్పోయామంటూ దక్షిణాఫ్రికా బాక్సింగ్ సంఘం విచారం వ్యక్తం చేసింది.