: 'హ్యపీ ఇండియా' పేరిట నిరుద్యోగులకు మాజీ మంత్రి శైలజానాథ్ కుచ్చుటోపీ?
మాజీ మంత్రి శైలజానాథ్ పై చీటింగ్ కేసు నమోదు చేయాలని మంగళవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఉద్యోగాలిస్తామని తమ వద్ద లక్షలాది రూపాయలు దండుకున్న శైలజానాథ్, ఆ తర్వాత తమకు ఉద్యోగాలు ఇవ్వలేదని నిరుద్యోగులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. 'హ్యాపీ ఇండియా' పేరిట ఓ సంస్థను తెరిచిన శైలజానాథ్, ఈ-కామర్స్ సంస్థగా దానిని ప్రచారం చేసుకున్నారని తెలిపారు. హ్యాపీ ఇండియాలో ఆకర్షణీయమైన వేతనాలతో ఉద్యోగాలు కల్పిస్తామని తమకు చెప్పారని బాధితులు చెబుతున్నారు. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసిన శైలజానాథ్, డబ్బును తిరిగిచ్చేందుకు అంగీకరించడం లేదని తెలిపారు. దీంతోనే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదును పరిశీలిస్తున్న పోలీసులు నేడు శైలజానాథ్ పై కేసు నమోదు చేసే అవకాశాలున్నాయి.