: 144 మందే ఆస్తుల చిట్టా విప్పారు... 401 మంది ఎంపీలు వెల్లడించడం లేదు
లోక్ సభలోని మొత్తం 545 మంది ఎంపీల్లో కేవలం 144 మంది ఎంపీలు మాత్రమే తమ ఆస్తుల చిట్టా విప్పారు. మిగిలిన 401 మంది ఎంపీలు తమ ఆస్తుల గుట్టు విప్పేందుకు ససేమిరా అంటున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం లోక్ సభకు ఎన్నికైన 90 రోజుల్లోపు ప్రతి సభ్యుడు తన ఆస్తుల వివరాలు సమర్పించాలి. కానీ, ఇంతవరకు 401 మంది ఎంపీలు తమ ఆస్తుల వివరాలు వెల్లడించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ వివరాలు సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడయ్యాయి. ఈ జాబితాలో బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఉండడం విశేషం. వారే కాకుండా, అధికార బీజేపీకి చెందిన 209 మంది ఎంపీలు తమ ఆస్తుల వివరాలు వెల్లడించలేదు. కాంగ్రెస్ లో 31 మంది, తృణమూల్ కాంగ్రెస్ లో 27 మంది, బీజేడీకి చెందిన 18 మంది, శివసేనకు చెందిన 15 మంది, 14 మంది టీడీపీ ఎంపీలు, ఏఐఏడీఎంకే ఎంపీలు 9 మంది, టీఆర్ఎస్ కు చెందిన 8 మంది ఎంపీలు, వైఎస్సార్సీపీకి చెందిన 7 గురు ఎంపీలు, ఎల్జేపీకి చెందిన ఆరుగురు, ఎన్సీపీకి చెందిన నలుగురు, సీపీఐ(ఎం)కి చెందిన ముగ్గురు, సమాజ్ వాదీ పార్టీ ఎంపీలు ముగ్గురు తమ ఆస్తులు వెల్లడించని వారిలో ఉన్నారు.