: యాక్సిడెంట్లో చనిపోయిన చెల్లెలికి గుడి కట్టిన అన్నయ్య


ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తన చెల్లెలికి గుడి కట్టి ఓ వ్యక్తి వార్తల్లో నిలిచాడు. అతని పేరు వల్లెపు శివప్రసాద్. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులో నివసించే ఈ యువకుడు ఇంటర్ వరకు చదివి, నెల్లూరు టౌన్లోని ఆత్మకూరు బస్టాండులో జ్యూస్ షాపు నడిపుతున్నాడు. చెల్లెలు సుబ్బలక్ష్మి అంటే ప్రాణం. డిగ్రీ చదివిన ఆమెకు 2009లో అటవీశాఖలో ఉద్యోగం వచ్చింది. తొలుత చిల్లకూరు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ గా విధుల్లో చేరిన ఆమెకు, తర్వాత వెంకటగిరి బదిలీ అయింది. సుబ్బలక్ష్మి విధులకు రోజూ రైల్లో వెళ్ళి వస్తుండేది. 2011 సెప్టెంబర్ 20న... ఆఫీసులో లేట్ కావడంతో ఆమెను తీసుకురావడానికి నెల్లూరు రైల్వే స్టేషన్ కు వెళ్ళాడు అన్నయ్య శివప్రసాద్. రైల్వే స్టేషన్ బయటికొచ్చి కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్న వారిని వెనుక నుంచి ఓ కారు ఢీకొట్టింది. దీంతో, శివప్రసాద్ తలకు దెబ్బతగిలింది. అతడు అదేమీ లెక్కచేయకుండా తన చెల్లెలి కోసం వెదికాడు. రోడ్డు పక్కన పడిపోయి ఉందామె. రక్తం మడుగుకట్టి ఉంది. స్థానికుల సాయంతో సుబ్బలక్ష్మిని ఆసుపత్రికి తీసుకెళ్ళగా, కష్టమేనన్నారు వైద్యులు. పక్కటెముకలు విరిగిపోయాయని, మరో ఆసుపత్రికి తీసుకెళ్ళమని సూచించారు. ఇక, చివరి క్షణాల్లో ఉన్న సుబ్బలక్ష్మి తల్లిదండ్రులను, మిగతా అన్నలను బాగా చూసుకోవాలని చెప్పింది శివప్రసాద్ తో. అలా చెబుతూనే కన్నుమూసింది. అప్పుడు ఆ అన్నయ్య బాధ వర్ణనాతీతం! ఆమె మరణ వార్త విన్న మిగతా కుటుంబ సభ్యుల పరిస్థితీ అంతే! ప్రాణానికి ప్రాణమైన సుబ్బలక్ష్మి ఇక లేదన్న విషయం జీర్ణించుకోలేకపోయారు వారు. శివప్రసాద్ అయితే ఆమె ధ్యాసలోనే ఉండేవాడు. ఓ రోజు ఆమెకు గుడి కడితే... అన్న ఆలోచన రావడమే ఆలస్యం వెంటనే రంగంలోకి దిగాడు. రూ.55000 తో తెనాలిలో విగ్రహం తయారుచేయించి, రూ.2 లక్షల ఖర్చుతో ఇంట్లోనే గుడికట్టించాడు. అప్పటినుంచి వారి కుటుంబం సుబ్బలక్ష్మి విగ్రహానికి పూజలు చేయసాగింది. ఆమె తండ్రి చెంచయ్య మాట్లాడుతూ, శక్తికి మించిన పనైనా గానీ, ఆమె జ్ఞాపకార్థం గుడికట్టామని తెలిపాడు. సోదరుడు శివప్రసాద్ మాట్లాడుతూ, భవిష్యత్తులో ఆమె పేరిట ట్రస్టు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకున్నామని చెప్పాడు.

  • Loading...

More Telugu News