: బ్రిటీష్ పార్లమెంటులో ఎలుకలు పడ్డాయి!
బ్రిటీష్ పార్లమెంటుకు ఇప్పుడో కొత్త సమస్య వచ్చిపడింది. ఉభయసభల భవనాల్లో ఎలుకలు స్వైరవిహారం చేస్తున్నాయట. దీంతో, ఎంపీలు పరిష్కార మార్గాలు వెతికే పనిలో పడ్డారు. మూషికాలకు విరుగుడుగా పిల్లులను రంగంలోకి దించాలని భావించారు. అయితే, ఎలుకలు లెక్కకు మిక్కిలి సంఖ్యలో ఉండగా, వాటికి ఒకట్రెండు పిల్లులు సరిపోవని ఎంపీ జాన్ థుర్సో అన్నారు. కానీ, పిల్లులు ఎక్కువైనా చిక్కేనని ఆయన అభిప్రాయపడ్డారు. పార్లమెంటులో ఆహార పదార్ధాలు తయారుచేసే ప్రదేశాల్లో ఎలుకలు సంచరిస్తే, వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఎంపీ ఏనే మెకింటోష్ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, 2011లో ప్రధాని అధికారిక నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్ లో ఎలుక ఒకటి సంచరించడం టీవీ చానళ్ళలో ప్రసారమైంది. దీంతో, ప్రధాని డేవిడ్ కామెరాన్ లారీ అనే పిల్లిని ప్రవేశపెట్టారు. అయితే, అది ఎలుకలను పట్టడం కంటే ఇతర కార్యకలాపాలకు మొగ్గు చూపుతోందని డౌనింగ్ స్ట్రీట్ వర్గాలు తెలిపాయి.