: డిఫాల్టర్ల జాబితాలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్?


ఫ్రైవేట్ బ్యాంకులే కాదండోయ్, ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా డిఫాల్టర్ల జాబితాలో చేరిపోతున్నాయి. తీసుకున్న రుణాలను చెల్లించడంలో విఫలమయ్యే సంస్థలను డిఫాల్టర్లుగా ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో ఇప్పటిదాకా ప్రైవేట్ కంపెనీలే ఉంటున్నాయి. తాజాగా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ (ఆప్కాబ్) కూడా డిఫాల్టర్ల లిస్టులో చేరబోతోంది. తీసుకున్న రుణంలో కనీసం వడ్డీ కూడా కట్టని ఆప్కాబ్ ను డిఫాల్టర్ గా ప్రకటించేందుకు నాబార్డ్ సిద్ధమవుతోంది. గతేడాది రైతు రుణాల పేరిట నాబార్డ్ నుంచి రూ.9 వేల కోట్లను రుణంగా తీసుకున్న ఆప్కాబ్, వాటిని జిల్లాలవారీగా ఉన్న తమ శాఖలు డీసీసీబీలకు పంపింది. డీసీసీబీలు రైతులకు రుణాలు అందజేశాయి. కాని ఆ రుణాలు తిరిగి వసూలు కాలేదు. దీంతో, డీసీసీబీల నుంచి చిల్లిగవ్వ కూడా ఆప్కాబ్ కు జమ కాలేదు. ఈ నేపథ్యంలో, ఆప్కాబ్ కూడా నాబార్డ్ కు నయాపైసా చెల్లించలేదు. ఈ పరిస్థితిని ముందే పసిగట్టిన ఎంపీ యలమంచిలి శివాజీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడును అప్రమత్తం చేశారట. వడ్డీ కింద కనీసం రూ. 400 కోట్లైనా చెల్లిద్దామని చంద్రబాబుకు తాను సూచించినా, కొంతమంది అధికారులు తప్పుదోవ పట్టించారని ఎంపీ తెలిపారు. దీంతోనే ఆప్కాబ్ కు ఈ దుస్థితి పట్టిందని శివాజీ ఆరోపిస్తున్నారు. మరి ఆప్కాబ్ ను ఈ గండం నుంచి ఎలా గట్టెక్కిస్తారో చూడాలి.

  • Loading...

More Telugu News