: నరేంద్రమోడీ అయోధ్యలో రామాలయం నిర్మించాల్సిందే: సింఘాల్
కేంద్రంలో బీజేపీకి సొంతంగా మెజారిటీ వచ్చినందున అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) డిమాండ్ చేసింది. వీహెచ్పీ అగ్ర నాయకుడు అశోక్ సింఘాల్ బుధవారం అలహాబాద్ లో మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీని బీజేపీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్నారు. 1999-2004 సంవత్సరాల మధ్య సంకీర్ణం ఒత్తిళ్ల పేరిట అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి రామమందిర నిర్మాణం విషయలో తన అశక్తతను వ్యక్తం చేశారని ఆయన చెప్పుకొచ్చారు. కానీ, ప్రస్తుతం మోదీకి ఎటువంటి అవరోధాలూ లేవని.. ఆయన నాయకత్వంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వచ్చిందన్నారు. మత విశ్వాసాలకు సంబంధించిన సమస్యలను కోర్టులు ఎప్పటికీ పరిష్కరించలేవన్నది వీహెచ్పీ అభిప్రాయమని సింఘాల్ అన్నారు. పార్లమెంట్లో చట్టం ద్వారా నవ్య రామమందిర నిర్మాణానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. న్యాయ వివాదాల్లో ఏళ్ల తరబడి జాప్యం జరిగిన ఈ సమస్యను పరిష్కరించేందుకు మోదీ సర్కార్ తన అధికారాలను ఉపయోగించాలని ఆయన కోరారు. రామాలయ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తోందంటూ ఆర్ఎస్ఎస్ ప్రకటించిన రెండు రోజులకే వీహెచ్పీ అగ్రనేత చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో కూడా బీజేపీ రామాలయ నిర్మాణంపై వాగ్దానం చేసింది.