: చంద్రబాబు వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల దీక్ష
శ్రీశైలం జలవిద్యుత్ ఉత్పత్తిని ఆపివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే శ్రీశైలం డ్యాంలో నీటి మట్టం అడుగంటిందని... రాయలసీమవాసుల భవిష్యత్తు నీటి అవసరాల దృష్ట్యా విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని ఏపీ మంత్రి దేవినేని ఉమ ఇప్పటికే టీఎస్ మంత్రి హరీష్ రావుకు స్పష్టం చేశారు. అంతేకాకుండా, ప్రాజెక్టు కుడి వైపునున్న పవర్ హౌస్ లో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం విద్యుదుత్పత్తిని నిలిపివేసింది. ఎడమ గట్టునున్న పవర్ హౌస్ లో మాత్రం టీఎస్ ప్రభుత్వం ఇంకా విద్యుత్తును ఉత్పత్తి చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం ఈ విషయాన్ని కృష్ణా నది యాజమాన్యం బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. మరోవైపు, ఇప్పటికే, తమ రాష్ట్రంలో విద్యుత్ లోటు చాలా తీవ్రంగా ఉందని... ఈ పరిస్థితుల్లో శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయమంటే ఎలా? అని టీఎస్ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో, శ్రీశైలం జలవిద్యుత్ ఉత్పత్తిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నాకు సిద్ధమయ్యారు. ఈ మధ్యాహ్నం 12 గంటలకు ట్యాంక్ బండ్ మీద ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా చేయనున్నారు.