: ఆస్ట్రేలియా ఉభయసభలనుద్దేశించి మోడీ ప్రసంగం
అమెరికా పర్యటనను దిగ్విజయంగా ముగించిన ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన, అమెరికా పర్యటన తరహాలోనే ఆస్ట్రేలియాలో ఉభయసభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. తద్వారా, ఆస్ట్రేలియా ఉభయసభలనుద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా మోడీ రికార్డు సృష్టించనున్నారు. వచ్చే నెలలో బ్రిస్బేన్ లో జరగనున్న జీ20 సదస్సుకు హాజరవుతున్న సందర్భంగా మోడీ, ఆ దేశ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆస్ట్రేలియాలోనూ అమెరికాలో ప్రసంగించిన మాదిరిగానే హిందీలోనే మోడీ తన ప్రసంగాన్ని వినిపించనున్నారు. ఇదిలా ఉంటే, మోడీ పర్యటన పట్ల పలువురు ఆస్ట్రేలియా సెనేటర్లు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు. హిందీలో మాట్లాడటం ద్వారా మోడీ, భారత సంస్కృతిని, శక్తిని ఆస్ట్రేలియాకు పరిచయం చేసినట్టవుతుందని టాస్మేనియాకు చెందిన సెనేటర్ లిసా సింగ్ చెప్పారు.