: మిస్డ్ కాల్ ప్రాణం తీసింది


ఓ మిస్డ్ కాల్ నిండు ప్రాణాన్ని బలిగొంది. మెదక్ జిల్లా దుబ్బాక మండలం ఎనగర్తి గ్రామానికి చెందిన కనకవ్వ (30)కు ఆకారం గ్రామానికి చెందిన నర్సింహ(36)తో 2005లో వివాహం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఏడాది క్రితం రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ మండలం, గుండ్లపోచంపల్లిలో నివాసముంటున్నారు. కనకవ్వ స్థానికంగా సీడ్స్ కంపెనీలో పనికి వెళ్తుండగా, నర్సింహ కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ దంపతులకు నవ్య అనే ఎనిమిదేళ్ల కుమార్తె ఉంది. కాగా, కనకవ్వపై అనుమానంతో నర్సింహ తరచుగా గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో రాత్రి మద్యం సేవించి ఇంటికి రాగా, తెల్లవారుజాము 3.30 గంటలకు కనకవ్వ సెల్‌ఫోన్‌కు ఓ మిస్డ్ కాల్ వచ్చింది. అంతే, ఆ కాల్ ఎక్కడ నుంచి వచ్చింది? ఎవడు చేశాడు? అంటూ అతను ఆమెను చితకబాదాడు. దెబ్బలకు తాళలేని కనకవ్వ సృహ కోల్పోయింది. తీవ్రగాయాలైన ఆమెను పేట్ బషీరాబాద్ ఆర్‌ఆర్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, నర్సింహను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మిస్డ్ కాల్ పై ఆరా తీస్తున్నారు.

  • Loading...

More Telugu News