: కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ‘లేజీ బాబు’ల ఆటలిక చెల్లబోవు!
కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల పనితీరుపై కొంతకాలంగా నిఘా పెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ, ఆయా కార్యాలయాల్లోని లేజీ బాసుల లీలలపై పూర్తి స్థాయిలోనే వివరాలు సేకరించారు. వివరాల సేకరణ పూర్తి అయ్యిందో, లేదో సదరు బద్ధకస్తుల మత్తు వదిలించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా తొలుత దేశ రాజధాని నగరం ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కొత్తగా బయోమెట్రిట్ హాజరును అమలు చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవస్థ ఢిల్లీలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ నెలాఖరులోగా ఏర్పాటు కానుంది. దీని ప్రకారం విధులకు ఆలస్యంగా హాజరయ్యే అధికారులు, సిబ్బంది మూల్యం చెల్లించుకోక తప్పదు. అంతేకాక ఇతర కార్యాలయాల్లో పని నిమిత్తం వెళ్లామని నిత్యం చెప్పుకుంటూ కాలం వెళ్లదీస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకూ ఈ వ్వవస్థ ముకుతాడు వేయనుంది. ఈ వ్యవస్థ ద్వారా ఒక కేంద్ర ప్రభుత్వ కార్యాలయానికి చెందిన అధికారి, మరో కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ యంత్రం ద్వారానూ హాజరు వేసుకోవచ్చు. దీంతో అధికారిక పని మీదే బయట ఉన్నామంటూ చెప్పుకునే అధికారుల వాదన ఇకపై చెల్లబోదు. ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు మరింత వేగం పుంజుకునేందుకు అవకాశమేర్పడుతుంది.