: ఇస్రో చరిత్రలో మరో విజయం: పీఎస్ఎల్వీ సీ26 విజయవంతం


భారత అంతరిక్ష పరిశోధనలో ఇస్రో మరో విజయాన్ని నమోదు చేసింది. గురువారం తెల్లవారుజామున 1.32 గంటల ప్రాంతంలో ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ26 విజయవంతంగా నింగికెగిసింది. నేవిగేషన్ కు సంబంధించి మొత్తం ఏడు ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నారు. అందులో మూడవదైన ఐఆర్ఎన్ఎస్ఎస్ 1సీని మోసుకెళ్లిన పీఎస్ఎల్ వీ26, దానిని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. శ్రీహరికోటలో సతీశ్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి ఐఆర్ఎన్ఎస్ఎస్ 1సీతో నింగికెగసిన పీఎస్ఎల్వీ సీ26 సరిగ్గా 20 నిమిషాల తర్వాత దానిని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో ఒక్కసారిగా హర్షాతిరేకం వ్యక్తమైంది. 60 రోజుల పాటు వెయ్యి మంది శాస్త్రవేత్తల కృషి ఫలితంగా ఈ విజయం సాధించామని ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ వెల్లడించారు. ఐఆర్ఎన్ఎస్ఎస్ 1సీతో దేశంలోని భూతల, వాయు, జల మార్గాల్లో వాహన చోదకుల మార్గదర్శకత్వానికి ఉపయోగపడే స్వదేశీ నావిగేషన్, ప్రకృతి విపత్తులపై అప్రమత్తత, నిఘా కార్యకలాపాలు మరింత సులువు కానున్నాయి.

  • Loading...

More Telugu News