: చర్మ సౌందర్యానికి మేలు చేసే ఫ్రూట్ జ్యూసులు
మిలమిల మెరిసే చర్మ సౌందర్యాన్ని కోరుకోని వారెవరుంటారు? అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఈ రోజుల్లో తాజాగా కనిపించాలని భావిస్తున్నారు. అలా కనిపించాలంటే చర్మానికి తగిన పోషణ అందించాలి. ఫ్రూట్ జ్యూసులు తీసుకోవడం ద్వారా చర్మం కాంతులీనుతుందట. ఈ విషయంలో క్యారట్, ఆపిల్, ఆరెంజ్, టమేటా, బొప్పాయి జ్యూసులు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. క్యారట్లలో ఉండే విటమిన్ ఏ మొటిమలు, మచ్చలు, మంగు తదితర చర్మ రుగ్మతలను నివారిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లతో పరిపుష్ఠమైన ఆపిల్ పండ్లు తీసుకుంటే చర్మం ముడతలు పడదు. చర్మ కణజాలం దెబ్బతినదు. ఇక, ఆరెంజ్ తో చర్మం కొత్త సౌందర్యంతో మెరిసిపోతుందట. బొప్పాయిలోని పాపైన్ అనే ఎంజైము చర్మవ్యాధులను నయం చేయడంలో తోడ్పడుతుంది. రుచిగా లేకపోయినా అలోవీరా జ్యూస్ కూడా చర్మానికి మేలు చేసేదే. అందులో ఉండే ఖనిజలవణాలు, విటమిన్లు చర్మం యొక్క సాగే గుణాన్ని సరైన స్థితిలో ఉంచుతాయి. టమేటా జ్యూస్ లో ఉండే లైకోపేన్ అనే యాంటీ ఆక్సిడెంట్ చర్మం రంగును మెరుగుపర్చడమే కాకుండా, ముడతలను కూడా మాయం చేస్తుంది.