: విశాఖ నుంచి హైదరాబాదుకు రావాలంటే రూ.4000!


సప్లయ్ డిమాండ్ సూత్రాన్ని ప్రైవేట్ ట్రావెల్ ఆపరేటర్లు బాగా ఒంటబట్టించుకున్నారు. అందినకాడికి పిండుకుని ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతున్నారు. విశాఖపట్టణం నుంచి హైదరాబాదుకు బస్సులో రావాలంటే సాధారణ రోజుల్లో నాన్ ఏసీ 600 రూపాయలు, ఏసీ 800 రూపాయలు చార్జ్ అవుతుంది. ఇక వారాంతాల్లో నాన్ ఏసీ 800, ఏసీ 1000 రూపాయల ఛార్జీలు సాధారణంగా ఉంటాయి. వారం రోజులుగా విశాఖపట్టణానికి ఎటువంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో ఇప్పుడు ప్రైవేట్ ఆపరేటర్ల పంటపండింది. వైజాగ్ నుంచి హైదరాబాదుకు బస్సులో రావాలంటే 4000 రూపాయలు చెల్లించాల్సిందే. విశాఖ నుంచి బెంగళూరుకు 5000 రూపాయలు, చెన్నైకి 4500 రూపాయలు వసూలు చేస్తున్నారు. దీంతో సామాన్యులు వైజాగ్ నుంచి బెంగళూరు, చెన్నై, హైదరాబాదు రావాలంటే బెంబేలెత్తిపోతున్నారు. జేబులకు చిల్లుపడుతున్నాయి. ప్రైవేట్ ఆపరేటర్లు తీసుకుంటున్న ఛార్జీల కంటే విమానాల్లో ఆయా పట్టణాలకు వెళ్ళడానికి తక్కువవుతుందని ప్రయాణికులు వాపోతున్నారు. అయితే విమాన, రైల్వే సర్వీసులు లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు ఆపరేటర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో అమాంతం రేట్లు పెంచేసి వసూలు చేసుకుంటున్నారు. ఇంత వరకు ఆయా పట్టణాలకు రాత్రిపూట మాత్రమే సర్వీసులు నడిపే ఆపరేటర్లు ఇప్పుడు పగటి పూట సర్వీసులు కూడా ప్రారంభించారు. కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన బస్సులతో సర్వీసులు నడుపుతున్నట్టు సమాచారం. విశాఖ నుంచి పరిమిత ఆర్టీసీ సర్వీసులు ఉండడంతో ప్రైవేటు ఆపరేటర్ల పంటపండింది.

  • Loading...

More Telugu News