: మోడీ మాట తప్పరు... అవసరమైతే కేంద్ర మంత్రులతో మాట్లాడతా: పవన్ కల్యాణ్
తుపాను సహాయక చర్యల కోసం తక్షణ సాయంగా రూ. 1000 కోట్లను కేటాయించిన ప్రధాని మోడీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. మోడీ మాటమీద నిలబడే వ్యక్తి అని... అందుకే ఆయనకు మద్దతిచ్చానని అన్నారు. తుపాను బాధితులను మోడీ అన్ని విధాలుగా ఆదుకుంటారని చెప్పారు. అవసరమైతే కేంద్ర మంత్రులతో కూడా మాట్లాడతానని తెలిపారు. తుపాను భాధితులను పరామర్శించేందుకు వెళ్లిన పవన్ రాజమండ్రి చేరుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. ముందస్తు చర్యలు చేపట్టడంలో, సహాయక చర్యలు కొనసాగించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అద్భుతంగా పనిచేశాయని పవన్ కొనియాడారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బ్లాక్ మార్కెటింగ్ పెరిగిపోతుంటుందని... వాటిని అరికట్టాల్సి ఉంటుందని చెప్పారు. బ్లాక్ మార్కెట్ వ్యాపారాన్ని అడ్డుకోవాలని అభిమానులకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. విద్యార్థులు శ్రమదానం చేయాలని సూచించారు. విశాఖ వెళ్లి బాధితులను పరామర్శిస్తానని చెప్పారు. తుపాను బాధితులకు అవసరమైన సాయం చేస్తానని అన్నారు. ప్రతి ఒక్కరూ మాటల్లో కాకుండా చేతల్లో సాయం చేయాలని సూచించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వీఐపీలు ఎంత తక్కువ వస్తే అంత మేలని... వీఐపీల వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని అభిప్రాయపడ్డారు.