: వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం బాధ్యత నాదే: కేసీఆర్
హైదరాబాదు సహా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం పట్టణాల అభివృద్ధి బాధ్యత తనదేనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఈ నాలుగు పట్టణాల్లో బడ్జెట్ సమావేశాల తరువాత పర్యటించి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. వాటర్ గ్రిడ్ ద్వారా అన్ని నగరాలకు మంచి నీరు అందజేస్తామని ఆయన తెలిపారు. నగరాల్లో రోడ్లు, పారిశుద్ధ్యం, వైద్యం, విద్య రంగాలపై ప్రధానంగా దృష్టి పెడతామని ఆయన వివరించారు. డిసెంబర్ లో చెరువుల పునరుద్ధరణ పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా కార్యక్రమాన్ని రూపకల్పన చేయాలని ఆయన సూచించారు. సీఎం నుంచి పాఠశాల విద్యార్థి వరకు అందరూ ఇందులో పాలు పంచుకోవాలని ఆయన చెప్పారు. నల్గొండ జిల్లా నార్కట్ పల్లిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించనున్నామని ఆయన వెల్లడించారు.