: భారత్ నుంచి జమ్మిచెట్టు తీసుకెళ్ళి లండన్ లో 'బతుకమ్మ' ఆడారు!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగను విశేష రీతిలో జరుపుకోవడం తెలిసిందే. ఇటు తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోనూ బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో లండన్ లో తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సహకారంతో నిర్వహించిన ఈ ఉత్సవాల కోసం భారత్ నుంచి జమ్మిచెట్టును తీసుకెళ్ళడం విశేషం. ఈ జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. లండన్ లోని ఐజల్ వర్త్ అండ్ సియాన్ స్కూల్ ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకల్లో తెలంగాణ ఆడపడుచులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారులు సైతం బతుకమ్మ పాటలతో అలరించారు. తెలంగాణ ఎన్నారై ఫోరం వ్యవస్థాపక సభ్యుడు అనిల్ కుర్మచలం మాట్లాడుతూ, తమకు సహకరించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు, ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు కేవీ రమణాచారికి ధన్యవాదాలు తెలిపారు.