: ఉన్న జుట్టునైనా కాపాడుకుందాం ఇలా..!
జుట్టు రాలడం అనేది నేడు పురుషులు, స్త్రీలు, చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా అత్యధికులను వేధిస్తున్న సమస్య. జన్యువుల సంగతి పక్కనబెడితే, మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు కూడా జుట్టు రాలడానికి కారణమవుతున్నాయి. 35 ఏళ్ళు దాటిన పురుషుల్లో 40 శాతం మంది ఈ సమస్యతో సతమతమవుతున్నారట. దీనిపై ప్రముఖ ట్రైకాలజిస్ట్ అపూర్వ షా మాట్లాడుతూ, జుట్టు పలుచబడడంతో తలపై మాడు కనిపించడాన్ని చాలామంది ఇబ్బందికరంగా భావిస్తుంటారని, హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఈ సమస్య వస్తుందని తెలిపారు. మారుతున్న లైఫ్ స్టయిల్ కారణంగా తలెత్తే ఒత్తిళ్ళు హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయని వివరించారు. ఈ నేపథ్యంలో ఊడిపోయిన జుట్టును తిరిగి మొలిపించడం కష్టమని (హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ మినహా), అందుకే ఉన్న జుట్టును కాపాడుకునేందుకు కొన్ని సూత్రాలు పాటిస్తే సరి అని అపూర్వ షా పేర్కొన్నారు. పాలకూర, విరిగిన పాలతో తయారు చేసే జున్ను, ఆక్రోట్లు, అవిసెలను ఆహారంలో తప్పక చేర్చాలని సూచించారు. వీటిలో ఉండే పోషక పదార్థాలు జుట్టు పెరుగుదలకు ఉపకరిస్తాయని వివరించారు. జీవనశైలిలో ఎదురయ్యే ఒత్తిళ్ళను అధిగమించేందుకు యోగా, ధ్యానం వంటివి చేయాలని, తద్వారా జుట్టు రాలడానికి కారణమయ్యే అదనపు టెస్టోస్టిరాన్ ఉత్పత్తికి అడ్డుకట్టవేయవచ్చని తెలిపారు. జుట్టుకు రంగేయడం, హెయిర్ స్టైలింగ్ జెల్ పూయడం వంటి చర్యలకు స్వస్తి చెప్పాలని, వాటిలోని రసాయనాలు వెంట్రుకల నిర్మాణాన్ని దెబ్బతీస్తాయని అపూర్వ షా చెప్పారు.