: ‘మహా’ బరిలో 34 శాతం మంది నేరచరితులే!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన వారిలో 34 శాతం మంది నేరచరితులేనట. ఎన్నికల సంఘానికి సమర్పించిన తమ అఫిడవిట్లలో కొందరు ఈ వాస్తవాలను వెల్లడించగా, 51 శాతం మంది అభ్యర్థులు అసలు వివరాలను అందించలేదు. అయితే, మహారాష్ట్ర ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ లు అభ్యర్థుల తెరవెనుక కేసులను వెలికితీశాయి. 288 స్థానాలకు మొత్తం 2,336 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, వారిలో కేవలం 49 శాతం మంది మాత్రమే తమపై నమోదైన కేసుల వివరాలను వెల్లడించారు. ఇక నేరచరితులగా తేలిన 798 మంది అభ్యర్థుల్లో అన్ని పార్టీలకు చెందిన వారూ ఉన్నారట. మొత్తం అభ్యర్థుల్లో 23 శాతం మంది మాత్రం, తమపై హత్య, కిడ్నాప్, మత కలహాలను రెచ్చగొట్టడం, మహిళలపై నేరాలకు సంబంధించి కేసులు నమోదయ్యాయని స్వయంగా ఒప్పుకున్నారట. ఉరాన్, కలినా, అను శక్తి నగర్, బాంద్రా ఈస్ట్ తదితర నియోజకవర్గాల్లో ఏడుగురు చొప్పున నేచ చరిత్ర కలిగిన అభ్యర్థులు బరిలో ఉన్నారట. ముగ్గురు చొప్పున నేరచరితులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల సంఖ్య 156గా తేలింది.