: రజనీ ఈసారి కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారా?


తమిళనాట రాజకీయాల్లో చాలా కాలంగా జరుగుతున్న చర్చ మరోసారి ఊపందుకుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా? అంటూ తమిళనాట ఆసక్తికర చర్చ ప్రారంభమైంది. జయలలిత జైలు పాలుకావడంతో కరుణానిధికి తిరుగులేదని, ఈ సమయంలో రజనీకాంత్ ను రంగంలోకి దించి లబ్ది పొందాలని బీజేపీ చూస్తోందని తమిళనాడులో ఊహాగానాలు మొదలయ్యాయి. వాస్తవానికి మొదటి నుంచీ తమిళ రాజకీయ ముఖచిత్రంలో సినీ కళాకారులదే అగ్రతాంబూలం. సినీ నటులే రాజకీయాల్లో విజయసోపానాలధిరోహిస్తున్నారు. అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత అంతా సినీ కళామతల్లి ముద్దుబిడ్డలే. అన్నాదురై, కరుణానిధి వెండితెర వెనుక నుంచి వస్తే వెండితెరవేల్పులుగా ఎంజీఆర్, జయలలిత రాజకీయాల్లో తమదైన ముద్రవేశారు. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రజనీకాంత్ ను బీజేపీ రంగంలోకి దించేందుకు సన్నాహాలు చేస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా రజనీకాంత్ను రాజకీయాలలోకి ఆహ్వానిస్తూ ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. తమిళనాట రాజకీయ రంగ ప్రవేశం చేస్తే తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అతనిని ప్రతిపాదిస్తామనే ప్రతిపాదనను ఆయన ముందుంచినట్టు సమాచారం. రజనీకాంత్ ను రాజకీయాల్లో దించి తమ పార్టీ ప్రాభవం పెంచుకోవాని అమిత్ షా ఆశిస్తుండగా, ఆయన అసలు బీజేపీకి మద్దతు తెలిపే అవకాశం లేదని ఆ రాష్ట్ర రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన లేని రజనీ బీజేపీలో చేరితే పార్టీని నడపించాల్సిన అవసరం లేదని, ముఖ్యమంత్రి కూడా కావచ్చనే వాదన కూడా ఉంది. తమిళనాట పెద్దగా మద్దతులేని బీజేపీని రజనీతో పూరిస్తే బీజేపీకి వేయి ఏనుగుల బలం చేకూరినట్టే. దీంతో ఆ పార్టీ అధ్యక్షుడు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. సార్వత్రిక ఎన్నికల సందర్భలో బీజేపీ పలువురు తమిళ సినీ ప్రముఖులను ఆహ్వానించినప్పటికీ సరైన ఆదరణ లభించలేదు. దీంతో రజనీకి గాలం వేస్తే పార్టీకి తిరుగుండదని అమిత్ షా ప్లాన్. దీంతో బీజేపీ సూపర్‌స్టార్‌ను రాజకీయాలలోకి దింపే ప్రయత్నాలు చేస్తోంది. 1996లో డీఎంకే, తమిళ మానిల పార్టీల కూటమికి రజనీ మద్దతు పలకడంతో అవి విజయం సాధించాయి. 2004లో బీజేపీకి మద్దతు పలికిన రజనీకాంత్ ఆ పార్టీకే ఓటు వేసినట్లు ప్రకటించారు. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ తటస్థంగానే ఉన్నారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నైకి వచ్చిన నరేంద్రమోడీ రజనీకాంత్ ఇంటికి వెళ్లి మరీ కలుసుకున్నారు. ఆయనను ఎలాగైనా బీజేపీలో చేర్చుకునేందుకు ఎంతగానో ప్రయత్నించారు. అయినప్పటికీ రజనీ సున్నితంగా ఆయన ప్రతిపాదనను తిరస్కరించినట్టు సమాచారం. దీంతో తాజాగా మరోసారి అమిత్ షా రజనీతో చర్చలు ప్రారంభించినట్టు వార్తలు వెలువడడంతో సర్వత్ర ఆసక్తి రేగుతోంది.

  • Loading...

More Telugu News