: ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్... విశాఖ కేంద్రంగా కొత్త జోన్!
నవ్యాంధ్ర వాసుల ప్రత్యేక రైల్వేజోన్ కల త్వరలో సాకారం కానుంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంకా, అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ, ఇప్పటికే కేంద్ర స్థాయిలో దీనికి సంబంధించి చర్చలు పూర్తయ్యాయని తెలుస్తోంది. ప్రస్తుతం, కొత్త రైల్వేజోన్ విషయంలో ఏపీ ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు రైల్వే, ఆర్ అండ్ బీ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. విశాఖ, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్లను కలుపుతూ కొత్త రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు సమాచారం. విశాఖ కేంద్రంగా కొత్త రైల్వేజోన్ ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. పునర్విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక రైల్వే జోన్ హామీని అప్పటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చింది.