: తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం బాధ కలిగించింది: తలసాని
అవును, త్వరలోనే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సీఎం కేసీఆర్ తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సమావేశాలంటూ తమను పిలిచి టీఆర్ఎస్ ప్రభుత్వంపై టీడీపీ విమర్శలు చేయిస్తోందనీ, ఇలా ఆ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం బాధ కలిగించిందనీ అన్నారు. తెలంగాణలో విద్యుత్ కష్టాలకు గత ప్రభుత్వాలే కారణం అన్న తలసాని, 54 శాతం విద్యుత్ తెలంగాణకు ఇవ్వాల్సి వస్తుందనే కృష్ణపట్నం థర్మల్ కేంద్రాన్ని ప్రారంభించ లేదని ఆరోపించారు. ఇక తెలంగాణలో బస్సు యాత్రలకు వెళ్లాలనడం దురదృష్టకరమన్నారు. లోకేష్ కు తెలంగాణలో పార్టీ బాధ్యతలు ఇవ్వాలని చూస్తున్నారని, టీడీపీకి ఇక్కడ నాయకత్వమే లేదా? అని తలసాని ప్రశ్నించారు. మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ, బంగారు తెలంగాణ కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నామని చెప్పారు.