: ఘోర పరాజయం పాలైన టీమిండియా
కోచిలోని నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఘోరపరాజం పాలైంది. 322 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఏ దశలోనూ విజయం కోసం ప్రయత్నించలేదు. టీట్వంటీ అనుకున్నారో, లేక చాంపియన్స్ ట్రోఫీ మత్తులోనే ఉన్నారో, కానీ టీమిండియా టాపార్డర్ ఆటగాళ్లు 20 ఓవర్లలోనే చేతులెత్తేశారు. దీంతో టీమిండియా ఓటమి 20 ఓవర్లకే ఖరారైపోయింది. తరువాత మిడిలార్డర్ టెయిలెండర్లు బ్యాటింగ్ చేసేందుకు చాలా కష్టపడ్డారు. 322 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఓపెనర్లు జాగ్రత్తగా ఆడుతూ నిలదొక్కుకుంటున్న దశలో ఊహించని రీతిలో రహానే (24) రన్ ఔట్ గా వెనుదిరగడంతో భారత జట్టు కష్టాలు ప్రారంభమయ్యాయి. తరువాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ కేవలం రెండు పరుగులే చేసి స్లిప్పులో దొరికిపోయాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు కాస్త కుదురుకుంటున్నాడనుకునేంతలో అనవసర షాట్ కొట్టి బెన్ చేతికి చిక్కాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సురేష్ రైనా పరుగులేమీ చేయకుండానే బౌల్డయ్యాడు. దీంతో నిలకడగా ఆడుతున్న థావన్ కు ధోనీ (8) జత కలిసిన ధోనీ బౌల్డయ్యాడు. దీంతో జడేజా రంగ ప్రవేశం చేశాడు. ఇంతలో అర్ధసెంచరీ సాధించి ధాటిగా ఆడతాడని భావించిన ధావన్ ను శామ్యూల్స్ బౌల్డ్ చేశాడు. తరువాత వచ్చిన భువనేశ్వర కుమార్ (2), అమిత్ మిశ్రా (5), మోహిత్ శర్మ (8) ఇలా వచ్చి అలా వెళ్లారు.జడేజా 33 పరుగులతో నాటౌట్ గా నిలవగా, చివరి వికెట్ గా వెనుదిరిగిన షమి 19 పరుగుల కాస్త జాగ్రత్తగా ఆడినా ఫలితం లేకపోయింది. దీంతో 40 ఓవర్లలో టీమిడియా 9 వికెట్లు కోల్పోయి 197 పరుగులకు ఆలౌట్ అయింది.