: ఫ్లిప్ కార్ట్ ఆర్డర్లకు డిస్కౌంట్లు ఎవరిస్తారు?
ఈ-కామర్స్ దేశీయ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ రికార్డు స్థాయిలో ఆర్డర్లను సాధించింది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలో కేవలం పది గంటల వ్యవధిలో రూ.600 కోట్ల విలువ చేసే ఆర్డర్లను సాధించగలిగింది. ఇంకా ఆర్డర్ల వెల్లువ కొనసాగుతూనే ఉంది. ‘ద బిగ్ బిలియన్ డే’ కింద భారీ డిస్కౌంట్లు ఉన్నందునే వినియోగదారులు ఎగబడ్డారు. ఇక ఆయా ఆర్డర్లకు వస్తువులను చేరవేసే పనిని కూడా ఫ్లిప్ కార్ట్ మొదలు పెట్టింది. ఇదిలా ఉంటే, రికార్డు స్థాయిలో వెల్లువెత్తిన ఆర్డర్లు ఫ్లిప్ కార్ట్ కొంప ముంచేలా ఉన్నాయి. భారీ డిస్కౌంట్లకు వస్తువులను ఆఫర్ చేసిన ఫ్లిప్ కార్ట్, కొన్ని రకాల వస్తువుల కోసం దాదాపు 80 శాతం డిస్కౌంట్ ఇవ్వాల్సి ఉంది. కొన్ని సంస్థలు తమ మిగిలిపోయిన ఉత్పత్తులను వదిలించుకునేందుకు ఫ్లిప్ కార్ట్ కు భారీ ఆఫర్లే ఇచ్చాయి. మరికొన్ని సంస్థలు నామమాత్రపు డిస్కౌంట్లను ఇచ్చేందుకు ఫ్లిప్ కార్ట్ తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే కొన్ని సంస్థలు ఫ్లిప్ కార్ట్ తో ఈ తరహా ఒప్పందాలేమీ చేసుకోకపోగా, తమకు తెలియకుండా తమ ఉత్పత్తులకు ఫ్లిప్ కార్ట్ డిస్కౌంట్లెలా ప్రకటిస్తుందని ప్రశ్నిస్తున్నాయి. దీంతో ఫ్లిప్ కార్ట్ కు తాము మామూలు ధరకే వస్తువులను అందిస్తామని వారు తెగేసి చెబుతున్నారు. ఇదే జరిగితే, ఒక్కదెబ్బకు ఫ్లిప్ కార్ట్ కుప్పకూలిపోనుంది. అయితే వివిధ సంస్థలతో డిస్కౌంట్లకు సంబంధించిన అంశాలపై చర్చలు జరుపుతున్నామని ఫ్లిప్ కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ చెబుతున్నారు.