: నేడు జయలలిత బెయిల్ పిటిషన్ పై విచారణ
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నందుకు నాలుగేళ్ల జైలు శిక్షకు గురైన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ పిటిషన్ నేడు విచారణకు రానుంది. కర్ణాటక హైకోర్టు జయలలిత బెయిల్ పిటిషన్ విచారించనుంది. ఈ నేపథ్యంలో జయలలితకు బెయిల్ మంజూరు కావాలని జయ అభిమానులు పూజలు, దీక్షలతో పాటు ఆందోళనలకు దిగుతున్నారు. దీంతో కర్ణాటక రాజధాని బెంగళూరుకు పెద్ద సంఖ్యలో తమిళ తంబీలు చేరుకునే అవకాశాలున్నాయి. జయ బెయిల్ పిటిషన్ నేపథ్యంలో కర్ణాటక హైకోర్టు పరిసరాల్లో భారీ ఎత్తున భద్రత బలగాలను మోహరించారు. కోర్టు పరిసరాల్లో 144 నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. జయలలితకు తప్పనిసరిగా బెయిల్ మంజూరవుతుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో జయలలితకు సరైన సౌకర్యాలు లభించడం లేదంటూ తమిళ తంబీలు చేస్తున్న ఆరోపణలను కర్ణాటక జైళ్ల శాఖ తోసిపుచ్చింది. నిబంధనల మేరకే జయలలితకు సౌకర్యాలను కల్పిస్తున్నామని వారు వెల్లడించారు. మరోవైపు జయలలితను తమిళనాడు జైలుకు తరలించాలని కర్ణాటక ప్రభుత్వం కోర్టును కోరనుంది. ఇందుకోసం కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేకంగా న్యాయవాదిని నియమించింది. ఇక జయలలిత తరఫున ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ వాదనలు వినిపించనున్నారు.