: మోడీని కీర్తించడం మానుకోండి: థరూర్ కు కేరళ కాంగ్రెస్ అల్టిమేటం
ప్రధాని నరేంద్ర మోడీని కీర్తించడం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ కేరళ శాఖ, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ కు స్పష్టం చేసింది. స్వచ్ఛ్ భారత్ అభియాన్ సందర్భంగా మోడీ చాలెంజ్ కు నామినేట్ చేసిన పేర్లలో థరూర్ పేరు కూడా ఉంది. ప్రధాని ప్రకటనకు వెనువెంటనే స్పందించిన థరూర్, ప్రధాని ఆహ్వానాన్ని గౌరవంగా భావిస్తున్నానని, స్వచ్ఛ్ భారత్ లో పాల్పంచుకుంటానని చెప్పారు. ఆ సందర్భంగానే కాక పలుమార్లు థరూర్, ప్రధాని మోడీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారని కేరళ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, ఆ పార్టీ అధికార ప్రతినిధి హసన్ అసహనం వ్యక్తం చేశారు. అసలు మోడీ ఏం సాధించారంటూ హసన్ ప్రశ్నించారు. ఇకపై, మోడీని కీర్తిస్తూ ప్రకటనలు చేయరాదని థరూర్ కు ఆయన సూచించారు. దీనిపై థరూర్ స్పందిస్తూ... ప్రధాని రాజకీయాలకు అతీతంగా ఇచ్చిన పిలుపుపై స్పందించానని, అది నిజాయతీతో కూడుకున్న కార్యక్రమమని బదులిచ్చారు.