: బాల్ ఠాక్రేపై గౌరవంతోనే శివసేనను పల్లెత్తు మాటనడం లేదు: మోడీ
దివంగత నేత బాల్ ఠాక్రేపై ఉన్న అపార గౌరవంతోనే శివసేనను పల్లెత్తు మాట అనడం లేదని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరుసగా రెండో రోజు ఆదివారం కూడా పార్టీ తరఫున ప్రచారం నిర్వహించారు. శనివారం నాటి ప్రచారంలో భాగంగా కాంగ్రెస్, ఎన్సీపీలతో పాటు శివసేనపై కూడా ఆరోపణలు గుప్పించారన్న మీడియా కథనాలపై మోడీ స్పందించారు. శనివారం జరిగిన ప్రచారంలో శివసేనపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని వివరించారు. ‘‘బాలాసాహెబ్ ఠాక్రే అస్తమయం తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలివి. శివసేనపై ఒక్కమాట కూడా మాట్లాడకూడదని నిర్ణయించుకున్నా. బాల్ ఠాక్రేపై నాలో ఉన్న అపార గౌరవమే అందుకు కారణం’’ అని మోడీ ప్రకటించారు.