: ఏపీలో రైతు సాధికారత సంస్థ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ లో రైతు రుణ మాఫీ, సాగు వృద్ధి దిశగా చర్యలు చేపట్టేందుకు ఉద్దేశించిన రైతు సాధికారత సంస్థ ఏర్పాటైంది. గురువారం దీనిపై ప్రకటన చేసిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రెండు రోజుల్లోనే ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో సాగు, అనుబంధ రంగాలను ఒక్కతాటిపైకి తీసుకురావడంతో పాటు రైతులకు రుణాల మంజూరు, రుణాల చెల్లింపులో తలెత్తుతున్న పలు సమస్యలకు చెక్ పెట్టడమే ఈ సంస్థ లక్ష్యంగా ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో సాగు రుణాల మాఫీ అంశంపై కీలక చర్చ నడుస్తోంది. అసలు ఎన్నికల్లో హామీ ఇచ్చిన రీతిగా చంద్రబాబు ప్రభుత్వం రుణాలను మాఫీ చేస్తుందా? లేదా? అన్న అంశంపై సర్వత్ర ఆసక్తికరంగా చర్చ కొనసాగుతోంది. ఈ చర్చకు తెరదించుతూ చంద్రబాబు రైతు సాధికారత సంస్థను తెరపైకి తీసుకొచ్చారు. ఈ సంస్థ ద్వారానే రైతు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన చంద్రబాబు, దాని పేరు చేప్పే బ్యాంకులను కూడా ఒప్పించేశారు. అతి త్వరలో రైతు రుణాల మాఫీ అమలు కానుంది. ప్రభుత్వం తరఫున సాధికారత సంస్థ బ్యాంకులకు హామీ ఇవ్వనుంది. ఇక సాధికారత సంస్థను ప్రభుత్వం ఆర్థికంగా పరిపుష్ఠం చేయనుంది. వ్యవసాయం, అనుబంధ రంగాల నిధులతో పాటు ఇతరత్ర నిధులను కూడా సాధికారత సంస్థకు మళ్లించడం ద్వారా దానిపై బ్యాంకులకు భరోసా కల్పించనుంది. ఈ మేరకు శనివారం జీవో నెం. 197ను ప్రభుత్వం జారీ చేసింది. ఈ సంస్థలో రాష్ట్ర వ్యవసాయ, పశు సంవర్ధకం, ఉద్యానవనం, మార్కెటింగ్, ఆర్థిక శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులు వ్యవస్థాపక డైరెక్టర్లుగా కీలక భూమిక పోషించనున్నారు. వ్యవసాయ శాఖ పరిధిలోని కార్పొరేషన్లు, సొసైటీలను ఇందులో కలిపేస్తారు. దేశ, విదేశాలకు చెందిన వ్యవసాయ రంగ నిపుణులూ సభ్యులుగా ఉండనున్న ఈ సంస్థకు రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. సాధికారత సంస్థను ఏర్పాటు చేసిందే తరువాయి, సాగు రుణాల మాఫీ కోసం బడ్జెట్ కేటాయించిన రూ.5 కోట్లను ఆ సంస్థకు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.