: వంద రోజుల్లో నల్లధనం తెస్తానన్నారు...ఏది?: సోనియా సూటి ప్రశ్న
ప్రతిపక్షంలో ఉంటే ఎవరైనా ప్రశ్నాస్త్రాలతో అధికారపక్షాన్ని నిలదీస్తారనేందుకు ఊదాహరణగా ఏఐసీసీ ఛీఫ్ సోనియా గాంధీ నిలిచారు. హర్యానాలోని మెహమ్ ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో ఆమె నిప్పులు చెరిగారు. వందరోజుల్లో నల్ల ధనం వెనక్కి రప్పిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన బీజేపీ ప్రభుత్వం కమిటీ వేసి చేతులు దులుపుకుందని ఆమె మండిపడ్డారు. నల్లధనం ఏదని ఆమె బీజేపీని నిలదీశారు. బీజేపీ ప్రజలకు తప్పుడు హామీలిస్తోందని ఆమె ఆరోపించారు. ద్రవ్యోల్బణం తగ్గిస్తామని, ప్రజలకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన బీజేపీ, ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆమె ఎద్దేవా చేశారు. తాము ప్రారంభించిన పథకాలనే పేర్లు మార్చి బీజేపీ కాపీ కొడుతోందని ఆమె విమర్శించారు. కాగా, హర్యానాలో ఈ నెల 15న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.