: టీఆర్ఎస్ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్న కరెంట్ కష్టాలు


తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ కోతలు అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయని తెలుస్తోంది. కరెంట్ కోతల కారణంగా ఎండుతున్న పంటలతో రైతులు, ఉక్కపోత సమస్యతో సామాన్య జనం అల్లాడుతున్న నేపథ్యంలో, తాము గ్రామాల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొందని నాయకులు అంతర్గత సమావేశాల్లో వాపోతున్నారని సమాచారం. జనం నిలదీస్తే సరైన సమాధానం చెప్పలేక ఇబ్బందిపడుతున్నామని వారు ప్రైవేటు సంభాషణల్లో అంటున్నారు. ‘‘కరెంటు కోతలతో పొలాలు సరిగ్గా తడవడం లేదు. దీంతో పాటు, ఇటీవల వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో కరెంట్ కట్ చేస్తే చాలు జనం అల్లాడిపోతున్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా క్షేత్రస్థాయిలో ప్రజలతో కలసి మెలసి తిరిగాం. గ్రామస్థాయిలోనూ అనేక మంది దగ్గర మా ఫోన్‌ నెంబర్లు ఉన్నాయి. వారంతా నేరుగా ఫోన్లు చేసి కరెంటు కష్టాలపై ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు’’ అని టీఆర్‌ఎస్‌ నేతలు మీడియాతో జరిగిన ప్రైవేటు సంభాషణల్లో పేర్కొంటున్నారు. రుణమాఫీ జాప్యంపై రైతులకు సర్దిచెప్పగలిగామని, కరెంటు కోతలపై మాత్రం వారికి సమాధానం చెప్పలేకపోతున్నామని వారు అంటున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు తామే రోడ్లెక్కి ఆందోళన చేసి, ప్రభుత్వాన్ని నిలదీశామని... ప్రస్తుతం తామే అధికార పక్షంలో ఉండడంతో ఏం చేయాలో తెలియడం లేదని టీఆర్ఎస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News